సార్.. కాజేశారు...

విశాఖ జిల్లా పెందుర్తి మండలం వీర్రాజు చెరువును ఎమ్మెల్యే అదీప్ రాజు కబ్జా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ధ్వజమెత్తాయి. వీర్రాజు చెరువును చదును చేసి.. భూములు ఆక్రమిస్తున్నారని.. ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు బండారు అప్పలనాయుడు అంటున్నారు. మూడు గ్రామాలకు సంబంధించిన చెరువును ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


అక్కడే నొక్కేశారు..?


విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఇది. ఇక్కడ కనిపిస్తున్న చెరువు గురించే ఇప్పుడు మాట్లాడుకునేది. ఇక్కడ ఆరడుగుల లోతు పైనే ఉండే చెరువును పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆక్రమిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రామాపురం గ్రామ చెరువు సర్వే 206 ను ఆక్రమించడానికి చెరును తవ్వి నీళ్లు బయటకు పంపిస్తున్నారని అంటున్నారు. దానికి తగ్గట్టు అక్కడ క్రేన్ లతో పనులు కూడా జరుగుతున్నట్టు చూపించారు. మొత్తం 8ఎకరాల 68 సెంట్ల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని.. దీని విలువ 40 కోట్ల పైనే ఉంటుందని ఆరోపిస్తున్నారు. గ్రామ చెరువుని.. అదీ ప్రభుత్వ చెరువును ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా ఈ భూమి పై వివాదం నడుస్తున్న క్రమంలో.. ఆరు నెలల్లోనే దస్త్రాలు ఎమ్మెల్యేకు అనుకూలంగా కదిలాయని.. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా వచ్చాయని చెబుతున్నారు. అధికారులు వైసీపీ ఎమ్మెల్యేకి కొమ్ముకాస్తూ.. చెరువును రాసిస్తున్నారని.. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. 


ఇలా వినిపిస్తున్నారు...?


అటు ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా ఈ విషయం పై కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ భూమి చెరువు కాదని.. అక్కడ నీరు చేరిందని ఆయన వాదన వినిపిస్తున్నారు. తన భూమిలోకి నీరు చేరితే.. అది టీడీపీ ప్రభుత్వం చెరువని చెబుతోందని అంటున్నారు. అలాగే లీగల్ గా ఈ భూమి తన సొంతంగా చెబుతున్నారు. అయితే శుక్రవారం టీడీపీ నాయకులు వీర్రాజు చెరువు దగ్గరకు వచ్చి.. పనులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ.. ఇదేమి పట్టించుకోకుండా చెరువు చదును పనులు జరుపుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ సర్కారు దౌర్జన్యానికి ఇది నిదర్శనంగా ఆరోపించారు టీడీపీ నాయకులు.