ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్ పోస్టింగ్‌కూ అర్హులని సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది. సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ హోదా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడునెలల్లోగా శాశ్వత కమిషన్ హోదాను మంజూరు చేయాలని ఆదేశించింది. పురుషుల మాదిరే మహిళా అధికారుల నియామక నిబంధనలు ఒకేలా ఉండాలని తేల్చిచెప్పింది.
ఆర్మీ మహిళల పరిమితుల గురించి పలు అంశాలతో కూడిన జాబితాను కేంద్రప్రభుత్వం అపెక్స్ కోర్టుకు సమర్పించింది. శారీరక బలహీనత, శారీరకపరంగా మహిళలకు ఉన్న పరిమితులు వంటివి కూడా మహిళాధికారుల సర్వీసు కొనసాగింపునకు అవరోధాలుగా ఉంటున్నాయని ఈ నోట్‌లో కేంద్రం పేర్కొంది. ప్రధానంగా సైన్యంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే వివిధ ర్యాంకులలో కొనసాగుతున్నారని, వారిపై వున్న వివిధ సామాజిక, సాంస్కృతిక ప్రభావాల కారణంగా మహిళాధికారులను ఆమోదించే మానసిక చైతన్యం సైనిక యూనిట్లలో లేదని ఈ నోట్ పేర్కొంది.
స్త్రీపురుషుల మధ్య శారీరక వ్యత్యాసాల కారణంగా పురుషులతో పోలిస్తి సైనిక మహిళల శారీరక సామర్థ్యం తక్కువ ప్రమాణాలతో కూడి ఉంటోందని, అందుకనే మహిళాధికారుల శారీరక సామర్థ్యం సైనిక యూనిట్లలో ఇప్పటికీ సవాలు విసురుతోందని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నోట్ తెలిపింది. ఈ నోట్ సారాంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది.
శారీరక లక్షణాలను కారణంగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్ హోదా నిరాకరించడాన్ని కోర్టు తప్పుపడుతూ లింగ అసమానత్వపు ధోరణిని కేంద్రం విడనాడాలని హితవు పలికింది. మహిళల శారీరక లక్షణాలతో వారి సామర్ధ్యాన్ని అంచనావేయడం మహిళలకు, సైన్యానికీ అవమానకరమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా అధికారులను కమాండ్ పోస్టులకు నిరాకరించడం పక్షపాతపూరిత నిర్ణయమని, సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది.
సైనికాధికారులు యుద్ధరంగంలో అందరికంటే ముందుండి తమ నియంత్రణలోని పురుషులకు నాయకత్వం వహించాల్సి ఉంటుందని, అందుకే యుద్దరంగంలో ప్రత్యక కర్తవ్యాలు నెరవేర్చడానికి తగిన శారీరక సంపత్తి సైనిక అధికారిణులకు ఉండాలని కేంద్రం నోట్‌లో పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎత్తిపడుతూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సైన్యంలో పురుషులుకు, మహిళలకు మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్ష తొలిగిపోనుందని భావిస్తున్నారు.