ఆర్భాటంగా ప్రకటన.. ఆరంభంలోనే వివాదం.. అమలు విషయంలో సందేహం.. మొత్తానికి రగులుతున్న మంటల్లాగా మారింది.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంశం. ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నాటి నుంచీ నేటి వరకూ అంతటా ఆందోళనలే. ప్రశాంతంగా నిర్మించుకుని మనది అనిపించుకోవాల్సిన రాజధాని అంశం రాజకీయంగా.. సామాజికంగా చిచ్చు రేపుతోంది. అసలు విశాఖ రాజధానిగా వస్తే వచ్చే లాభాలు ఎవరికి.? ఒక వర్గం.. ఒక కులం.. ఒక వ్యక్తికి లాభమా.. లేక సర్వజనులకు ఇది ఆమోదమా.?? పరిశీలిద్దాం.
ఆది నుంచీ పరాయే..!
విశాఖ అంటే ఒక వైపు సముద్రం.. రెండో వైపు కొండలు. తూర్పు కనుమల సౌందర్యాన్ని.. తీరంలోని ఆహ్లాదాన్ని కలిపి చూపే ప్రాంతం. విశాఖకు దశాబ్థాల చరిత్ర ఉంది. విశాఖపట్నానికి ఆ పేరు పెట్టడం నుంచే వలసకు అలవాలమైంది. విశాఖ వాసి తప్ప.. అందరూ సుఖంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉంటే అది ఇదే. దాదాపు ఈ జిల్లా ఆవిర్భావం నుంచీ ఇప్పటి వరకూ వలస జీవుల ఆధిపత్యమే తప్ప.. స్థానికునికి ఏనాడూ బలం లేదు. ఆ మాటకొస్తే.. అసలు ఇక్కడ స్థానికుడికి విలువే లేదు. ఉన్నదల్లా ఓటు హక్కు.. అది వినియోగించుకునేటప్పుడు నా అనే బాధ. అంతకుమించి సగటు వైశాఖేయుడికి దక్కింది ఏమీ లేదు. జిల్లా వాసినని చెప్పడానికే తప్ప.. విశాఖ వాస్తవ్యుడి బ్రతుకు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఏడిచింది. మరి కొత్తగా ఏ అభివృద్ధి జరిగినా.. ఇక్కడి స్థానికులకు లబ్ధి చేకూరుతుందని ఆశించడం పిచ్చే.
పొరుగు జిల్లాల ఆధిపత్యమే..
మొదటి నుంచీ విశాఖది పరాయి ఆధిపత్యమే. బ్రిటీష్ కాలం నుంచీ ఈ ఆనవాయితీ నడుస్తోంది. పర ప్రాంతీయుల్ని తప్పక అక్కున చేర్చుకోవడం విశాఖ వాసులకు అలవాటు. అదేంటో.. కనీసం ఈ జిల్లా మనది అని కనీసం పౌరుషం చూపించలేకపోవడం కూడా ఇక్కడవారికి అలవాటే. ఇటు ఉత్తరాంధ్ర లోని రెండు జిల్లాలు.. అటు ఉభయగోదావరి జిల్లాలు.. కృష్ణ గుంటూరు.. ఇక నెల్లూరు, రాయలసీమ ప్రాంత వాసులు గత నాలుగు దశాబ్ధాలుగా ఈ ప్రాంతంలో ఆస్తులు కూడగట్టుకున్నారు. చక్కగా ఇక్కడ సెటిలర్స్ గా మారిపోయారు. వీరితో పాటు.. అటు నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువే. నావికాదళంతో పాటు.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పుణ్యమా అంటూ పర భాషీయులు ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ వలస పక్షులంటే విశాఖ వాసులకు అక్కర్లేనంత ఇష్టం. అందుకే వారి పాలనే ఇప్పటికీ నడుస్తోంది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా సింహాభాగం ఆ వలసపక్షులే ఉంటారు. ఇక ఎంత మాత్రమూ తీసిపోనంతగా ఈ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించేసి విశాఖ మాది అంటూ ఉంటాయి ఆ పక్షలు. చేసేదేం లేక.. స్థానికులు మౌనంగానే ఉంటాడెప్పుడూ.
అందుకే రాజధాని..?
పైన చెప్పిన కారణాలు చాలవా.. విశాఖ రాజధాని అవ్వడానికి. ముందు చెప్పిన అంశాలు చాలవా.. ఈ ప్రాంతం మరింత వలసవాదులది కావడానికి..? రాజధాని మాకొద్దని అరవాల్సిన విశాఖేయులు ఎప్పటికీ మౌన ముద్రలోనే ఉంటారు. రాజధాని కావాలని చెప్పేవారెవరూ విశాఖ వాసులు కాకపోవడం.. హాస్యాస్పదమే ఇక్కడ. కేపిటల్ అంటూ నినదిస్తున్న గొంతులన్నీ.. వలస వచ్చిన వారివే కావడం గుర్తించలేని దుస్థితి. అసలు ఇక్కడ రాజధాని వల్ల.. మా బతుకులు ఏమవుతాయో..? అని ఆందోళన చెందుతోన్న సగటు విశాఖ వాసి సంగతే రాజకీయ నేతలకు పట్టదు. అదే జరిగితే.. అసలు ప్రకటన చేసినప్పుడే పదికి పది సార్లు ఆలోచించేవాళ్లు..? ఎవరికో ఏదో చేయాలని..ఇంకెవరికో ఎసరెడుతున్న దారుణం చూస్తుంటే.. ఇదేం దరిద్రంరా నాయనా అంటూ అయోమయంలో వైశాఖేయులు. మొత్తం మీద రాజధాని కుంపటి వల్ల.. ఉన్న జీవితం దుర్భరం అవుతుందన్న ఆవేదన. వెరసి ఇప్పుడు ఇరకాటంలో ఉన్నది విశాఖ వాసే.
ఎవరడిగారు..?
మాకు రాజధాని కావాలని అడగలేదు వైశాఖేయులు..? అడిగింది పొరుగున ఉన్న జిల్లా సెటిలర్. మాకు కేపిటల్ కావాలని కోరలేదు విశాఖవాసి. కోరుకున్నది ఇక్కడ పోగేసుకున్న భూములున్న పర ప్రాంతీయులే. విశాఖ రాజధాని అవ్వాలని ఆశపడలేదు స్థానికుడు. అడిగినది కేవలం తిష్ట వేసుకు కూర్చున్న పర భాషేయులే. కారణాలేవైనా.. రాజధాని ఇష్టం లేనిది మాత్రం స్థానికుడికే. వద్దంటే మున్సిపాలిటీని మహా విశాఖ చేశారు. రూపాయి రేటున్న టాక్స్ వంద రూపాయలైంది. వద్దంటే వుడా అన్నారు. కనీసం వంద గజాలు కొనడానికి కూడా విశాఖ వాసికి గతిలేదు. కనీసం ఇకనైనా బ్రతకనీయండ్రా అంటున్నారు..? అయినా.. రాజధానిని తెచ్చి ఈ ప్రాంతాన్ని మరింత కాస్ట్లీ చేస్తున్నారు. ఇకపై మేమెలా బ్రతకగలమని.. వైశాఖేయుడే ఇక్కడ నుంచీ వలస పోయే దారుణం స్థితి వస్తోంది. ఎవరి ప్రయోజనం కోసమో.. లక్షలాది విశాఖ స్థానికుల్ని బలిపెడుతోంది ఈ రాజధాని అంశం.
వద్దంటే వద్దు..?
రాజకీయ స్వలాభం కోసం ఇప్పుడు రాజధాని ఇటు మారుతుంది. రేపు మరో ప్రభుత్వం వచ్చి ఈ రాజధానిని మళ్లీ మారుస్తుంది. అప్పుడు ఇది మరో అమరావతి అవుతుంది. గందరగోళం.. ఆందోళన మొదలవుతుంది. కానీ.. ఆందోళన చేయడానికి ఇక్కడ విశాఖలో అమరావతి రైతుల్లా.. బలమైన నిరసనకారులు కనపడరు. బక్కచిక్కిన.. కొండలు అడవుల పాలైన.. బడుగు బలహీన వర్గాలే పోరుబాట పట్టాలి. కానీ.. వారెవరూ అలాంటి సాహసాలు చేయలేరు. బ్రతకడానికే లేని జీవుడు.. ఇక పోరాటం వైపు ఏం చూస్తాడు..? అందుకే నిరసనగళానికి అందనంత ఎత్తైన రాజధాని. అందుకే వద్దంటోంది విశాఖ స్థానికత. మళ్లీ ఇదే అంశం పై వచ్చేవారం మరింత లోతు విశ్లేషణ.