గంజాయి ఉత్తరాంధ్ర జిల్లాలను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. ముఖ్యంగా మన్యం ప్రాంతంలో ఈ గంజాయి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అధికారుల ఎన్ని చేసినా.. ప్రభుత్వాలు ఎంత దృష్టి పెట్టినా.. ఈ గంజాయిని పూర్తిగా అరికట్టలేని పరిస్థితి. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా గంజాయి సాగు.. అక్రమ రవాణా ప్రభుత్వాలకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా.. వాటిలోని లొసుగులతో "గంజాయి" ఎంజాయిమెంట్ తగ్గలేదు. దీనిపై అక్షరశిల్పం వివరణాత్మక కధనం.
ఎలా పుడుతుంది..?
మన్యం ప్రాంతంలో గంజాయి సాగు నడుస్తోంది. దీనికి కారణం అక్కడ ఈ మొక్క మొలిచి పెరగడానికి అనువైన వాతావరణం ఉండటమే. ఏ సీజన్ లోనైనా కాస్తంగా చల్లటి వాతావరణం ఉండటం ఏజెన్సీ ప్రత్యేకత. అందుకే గంజాయి మొక్క అక్కడే సాగవుతుంది. మూలాలు అక్కడే ఉన్నాయి. అందుకే అక్కడ నుంచీ నివారణ మొదలుపెట్టాలంటారు నిపుణులు. అంటే మొక్క మొలిచిన దగ్గరే ఆపేస్తే.. ఇక రవాణా ఎందుకు జరుగుతుంది.? ఇదే ప్రధాన అంశం. ఇక ఆ తర్వాత కింది దార్లు.. ఎలాగూ అధికారులకు ఎరుకే. ఎక్కడ ఎవర్ని ఎలా పట్టుకోవాలి అటు ఎక్సైజ్ శాఖకు.. ఇటు పోలీస్ శాఖకు తెలియంది కాదు. కానీ.. మూలాల్ని పెకిలిస్తే.. తప్ప.. ఈ గంజాయి అంతు చూడలేమన్నది నిర్వివాదాంశం.
ఆపరేషన్ గంజా..?
ప్రభుత్వాలకు అక్షరశిల్పం అభ్యర్థనే అనుకోండి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఆపరేషన్ గంజా మొదలుపెడితే ఈ సమస్యలే ఉండవు. ఆపరేషన్ గంజా అంటే.. మొక్క ఎక్కడ మొలుస్తుందో అక్కడ్నించి అక్రమ రవాణా వరకూ ఈ పద్ధతిని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించాలి. గతంలో ఎర్రచందనం అక్రమాలు మితిమీరుతున్న క్రమంలో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. సేం టు సేం అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక గంజాయి ఆట కట్టించొచ్చని అంటున్నారు నిపుణులు.
ఎర్రచందనం ఇలా అరికట్టారు...!
ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేసే యత్నం గతంలో జరిగింది. స్మగ్లర్లపై కేసు నమోదు, దర్యాప్తు అధికారాలు కూడా ఒక టాస్క్‌ఫోర్స్‌కే ఇచ్చారు. దీనికి ఒక జీవో ఇచ్చి.. అటవీ చట్టం సవరణ.. ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణాకు దాదాపు కళ్లెం పడింది. రాష్ట్ర పోలీసు, అటవీ శాఖలు కలిపి.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ నియామకం జరిగింది. కేసుల నమోదు అధికారం.. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) జారీ.. తదుపరి దర్యాప్తు.. కోర్టులో అభియోగపత్రాలు దాఖలు వరకూ అంతా ఈ టాస్క్ ఫోర్స్ చూసింది. ప్రత్యేక విధుల కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడం అదే తొలిసారి. హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లలో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటయ్యాయి. ఎర్రచందనం నిందితులపై కేసుల నమోదు, అరెస్టు, దర్యాప్తు, ఇతరత్రా వ్యవహారాలన్నీ టాస్క్ ఫోర్స్ చేపట్టింది. ఆధారాలను సేకరించి, న్యాయస్థానాల్లో అభియోగపత్రాలను సైతం టాస్క్‌ఫోర్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇలా సర్వాధికారాలు ఇవ్వడంతో ఎర్రచందనం దాదాపు కనుమరుగైంది.
ఇక్కడా అలాగే చేస్తే..?
ఎర్రచందనంలాగే.. ఇటు గంజాయి పై ఉక్కుపాదం మోపే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే.. ఇక తిరుగులేదన్నది నిపుణులమాట. పలు కీలకాంశాలతో కూడిన ప్రతిపాదనల్ని ఇప్పటికే ఎక్సైజ్ శాఖల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకుని.. జీవో జారీ చేస్తే.. ఇక గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ మద్యం నియంత్రణపై ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. ఇక గంజాయి పై కూడా అలా చేస్తే.. పేరు మరింత వస్తుంది. అయితే ఇది చిన్న ప్రక్రియ కాదు. దీనికి సంబంధించిన బిల్లును ఎక్సైజ్.. పోలీసు విభాగం న్యాయ శాఖకు పంపాలి. టాస్క్‌ఫోర్స్‌కు కేసుల నమోదు అధికారం ఇవ్వడానికి అటవీ చట్టం సవరణ అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించాలి. అది న్యాయశాఖకు పంపాల్సిన బిల్లులో పొందుపరచాలి. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారడానికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో ఆర్డినెన్స్ జారీ చేస్తే ఇంకా మంచిది. విశాఖ కేంద్రంగా ఇది ఏర్పాటు చేస్తే.. బాగుంటుంది. అలాగే టాస్క్‌ఫోర్స్‌కు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహించాలి. పోలీసు, అటవీ, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా పనిచేయాలి. అలాగే ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించాలి. పెద్ద మొత్తంలో సిబ్బంది ఉండటం వల్ల కేసుల దర్యాప్తు సులువవుతుంది. ఇలా ప్రభుత్వం అడుగేయాలని అక్షరశిల్పం కోరుతోంది.