సంక్షేమ యుగానికి నాంది 'ఉగాది' - ప్రభుత్వ సలహాదారు ఎం.శామ్యూల్

పేదలందరికీ ఇల్లు కార్యక్రమంతో రానున్న ఉగాది పండుగ మరో సంక్షేమ యుగానికి నాంది కాగలదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం. శామ్యూల్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన    “ పేదలందరికీ ఇల్లు ” కార్యక్రమంపై జిల్లా యంత్రాంగం తో సమీక్షించారు. కార్యక్రమం అమలులో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలన్నరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు లో పేదలందరికీ ఇల్లు ఇవ్వడం ఒక ప్రధాన కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమం పురోగతి జిల్లాలో మెరుగ్గా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో అక్కడక్కడా సమస్యలు ఉన్నా, అధికార యంత్రాంగం వాటి పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తున్నారని ప్రశంసించారు.


ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నరని, ప్రభుత్వం అధికార యంత్రాంగంతోనే తన ఆలోచనలను అమలు చేస్తోందన్నారు. ఆలోచనలతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అందించాలని పిలుపునిచ్చారు. నిష్పక్షపాతంగా పారదర్శకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలను జరిపామన్నారు. ముఖ్యమంత్రి దార్శనికత కలవాలని ఆయన ప్రణాళికలను సమర్ధ వంతంగా అమలు పరచడం అధికారుల బాధ్యత గా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మితమయ్యే ఇళ్ల సముదాయాలకు మౌలిక వసతులతో బాటుగా పార్కు, ఆటస్థలం వంటివి కూడా కల్పించి గతంలో ఇందిరమ్మ కాలనీల లానే మోడల్ కాలనీలను రూపొందించాలన్నారు. తాశిల్దారు, ఎంపీడీవో, హౌసింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలలో తలెత్తుతున్న సమస్యలను కలెక్టరు, జాయింట్ కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు ఇబ్బందులను పరిష్కరించాలని చెప్పారు.


జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఇప్పటినుండి జాయింట్ కలెక్టర్లు ఇద్దరూ ప్రతిరోజు సంబంధిత తహసీల్దార్లు, ఆర్డిఓ లతో కార్యక్రమం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు. మార్చి 10వ తారీఖు నాటికి జిల్లాలో అవసరమైన ప్లాట్లు పూర్తవ్వాలి అన్నారు. ప్లాట్ల కేటాయింపు అందరినీ సంతృప్తి పరిచేలా లాటరీ పద్ధతిలో జరగాలన్నారు. ఇళ్ల పట్టాను ఆడవారి పేరు న ఇవ్వాలని ప్రభుత్వ నిర్దేశాలు ను అనుసరించి పట్టాను తాసిల్దారు జారీచేసి రిజిస్ట్రార్ కు పంపిస్తారని చెప్పారు. అదే విధంగా భూమి తీసుకున్న రైతులు కూడా సంతృప్తి పరిచేలా మార్కెట్ రేటుకే క్రయం జరపాలన్నారు. ఈరోజు నుంచి తాసిల్దార్ ఎంపీడీవో హౌసింగ్ డ్వామా అధికారులు ఉద్యోగులు పూర్తిగా ఇళ్ల లేఅవుట్ల పైననే దృష్టిసారించాలని ఆదేశించారు.


స్పందన లో దరఖాస్తు ఇచ్చిన వారి లో ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలం మంజూరు చేయాలన్నారు. ఇప్పటివరకు సమిష్టి కృషితో 90 శాతం పనులు పూర్తయ్యాయని మరో 20 రోజుల్లో మిగిలిన 10 శాతం పూర్తి చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం రూపకర్తల లో ఒకరైన శామ్యూల్ మనకి సలహాదారుగా ఉండడం అదృష్టమన్నారు. 


అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ లు ఎల్ శివ శంకర్ నర్సీపట్నం పాడేరు డివిజన్లలోని మండలాలను, ఎం. వేణుగోపాలరెడ్డి విశాఖపట్నం అనకాపల్లి డివిజన్ లోని మండలాల్లో కొనసాగుతున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై క్షుణ్ణంగా సమీక్షించారు. మండలాల వారీగా ఎన్ని ఇల్లు అవసరము ఎంత స్థలం సేకరించారు ఎంత స్థలం కొన్నారు అనే అంశాలపై సమీక్షించారు. ఏమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే తమ దృష్టికి తేవాలని తాసిల్దార్ ఎంపీడీవో లను ఆదేశించారు. మున్సిపాలిటీలలో రెవిన్యూ యంత్రాంగం, మునిసిపల్ కమిషనర్లతో సమన్వయం తో పని చేయాలన్నారు


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎల్. శివ శంకర్, ఎం. వేణుగోపాల్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా పరిషత్ సీఈవో నాగార్జునసాగర్, డ్వామా పీడీ సందీప్, గృహ నిర్మాణ శాఖ పి డి జయ రామాచారి, ఆర్డీవోలు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, అన్ని మండలాల తహసీల్దార్లు, ఉపాధి హామీ అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.