తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావు మనసు మనసులా లేకుండా పోయింది. అధికారంలేని ఎమ్మెల్యే పదవి ఎందుకు.. పెత్తనం లేకుండా పొలిటీషన్ గా ఎలా ఉండాలి అని ఆయన గిలగిలా గింజుకుంటున్నారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే జంపింగ్ జపాంగ్ కు రెడీ అయిపోయినా సరే ఏ పార్టీలోకి వెళితే ఏం వస్తుందా అన్న ఆశానిరాశాల మధ్య ఊగిసలాడురు. వైసీపీలోకి వెళితే వచ్చే పదవేంటి.. బీజేపీలోకి వెళితే దక్కేదేమిటి..అని మధన పడిన గంటా చివరకు కమలం గూటికి చేరడానికి రెడీ కావడం వెనుక దాగి ఉన్న వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాల లెక్కలు పూర్తిగా తేలనే లేదు గంటా పార్టీ జంప్ అంటూ ప్రచారం జోరుగా సాగింది. గత ఐదు నెలలుగా ఇదే ప్రచారం సాగుతున్నా సరే గంటా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ మారను అని చెప్పలేదు.. ఏ పార్టీలోకైనా వెళితే మీకు చెప్పనా అంటూ సాగదీసారు తప్పితే ఎక్కడా గుట్ట బయటపడకుండా పొలిటికల్ ఇంట్రెస్ట్ ను కొనసాగిస్తూ వచ్చారు. గంటా శ్రీనివాసరావు తొలుత వైసీపీలోకి వెళతారాని జోరుగా ప్రచారం జరిగింది. దాదాపుగా ముహూర్తం కూడా పెట్టేసుకున్నారని, దసరా ముందు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరిపోవడం వాస్తవమేనని ఊరూ వాడా టామ్ టామ్ అనింది. కానీ గంటా మాత్రం టీడీపీలోనే ఉన్నారు. దీంతో గంటా పార్టీ మార్పుపై ఊహాగానాలకు తత్కాలికంగా బ్రేక్ పడిపోయింది. దీంతో ఈ గంటా తెలుగుదేశంలో ఎలాగూ ఉండే పొలిటీషన్ కాదు.. ఇప్పుడు కాకపోతే మరోనాడు వెళ్లపోయేవాడు కదా మనకెందుకు టెన్షన్ అని అంతా వదిలేసారు.
దసరా తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే దానికి గంటా .. వస్తారా.. రారా.. అని ఉత్కంఠతను ఆయన అనుచరులే మీడియా ద్వారా ప్రజల్లో రేకెత్తించారు. చంద్రబాబు మూడు రోజులు విశాఖలో ఉంటే ఒక్కరోజు మాత్రమే కనిపించి మరునాడు నుంచి తనకు ముందుగా కుదుర్చుకున్న కార్య్రకమం ఉందని పత్తా లేకుండా పోయాడు గంటా. ఒకప్పుడు అధినేత వస్తున్నాడంటే నిద్ర పోకుండా మరీ ఏర్పాట్ల చేయడంలోనే నిద్రపోయిన గంటా, ఇప్పుడు లెక్క చేయకుండా బాస్ ను వదిలేసి మరీ పని పేరుతో షికార్లకు వెళ్లడం ఏమిటన్నలాజిక్ టీడీపీ వర్గాల్లో కలవరం సృష్టించింది. సరేలే బాబుకి అధికారం లేకపోయే సరికి గంటా లైట్ తీసుకుని ఉంటాడని అంతా ఊరుకున్నారు. మళ్లీ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇసక కొరతపై విశాఖ వీధుల్లో లాంగ్ మార్చ్ నిర్వహించాడు. దీనికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించడంతో పాటుగా తమ ప్రతినిధులుగా మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొంటారంటూ సమాచారం వెలువరించింది. తీరా లాంగ్ మార్చ్ లో చూస్తే అచ్చెన్న, అయ్యన్న కనిపించారు తప్పితే టార్చ్ లైట్ వేసి వెతికినా సరే గంటా ఎక్కడా కనపడలేదు. దీంతో గంటా వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ గంటా ఇంతే.. అధికారంలేకపోతే పట్టించుకోడు కదా అని అంతా లైట్ తీసుకున్నారు. ఇలాగో కమలం గూటికి చేరేందుకు కమలనాధులతో సంప్రదింపుల వ్యవహారం బయటపడటం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు దేశరాజధానిలో రెండు రోజుల పాటు బస చేసి కమలనాథులనతో బేరసారాలు సాగిస్తున్న వ్యవహారం బయటపడింది. దీంతో గంటా కమలం గూటికి అనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో తన మిత్రులు సుజనా చౌదరీ, సీఎం రమేశ్ లను మీడియేటింగ్ లాబీయింగ్ కు రంగంలోకి దించారు. బీజేపీలోకి వస్తే తనకు ఇచ్చేదేమి.. అనే వ్యవహారంపై బేరసారాలు సాగించారు. కమలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో రెండు రోజుల నిరంతరంగా చర్చలు జరిపిన గంటా చివరకు కమలం గూటికి చేరేందుకు ముస్తాబవుతున్నట్లు ఆయన క్యాడర్ కు ఉప్పందించాడు. దీంతో గంటా నిర్ణయం ఉన్నపళంగా క్యాడర్ కు అర్థం కాకపోయినా సరే.. సార్ వెళుతున్నాడు కాబట్టి బ్యాంక్ గ్రౌండ్ సెటిల్ మెంట్ ఏదో ఉండి ఉంటుందిలే అని సరిపెట్టుకుంటూ ఆయన వెనుకే నడిచేందుకు రెడీ అవుతున్నారు.
గంటాకు, ఆయన అనుచరులకు అండర్ స్టాండింగ్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ గ్రౌండ్ సెటిల్ మెంట్ ఏమిటో వారిలో వారికి క్లారిటీ ఏదో రోజు వస్తుంది. కానీ గంటా గురించి తెలిసిన ప్రజల్లో మాత్రం వైసీపీని కాదని పువ్వు పార్టీలోకి గంటా ఎందుకు జంప్ అవుుతన్నాడన్న సందేహం అందరి మెదళ్లను తొలిచి వేస్తోంది. రాజీకీయంగా గంటా ఎంత తెలివిగా పావులు కదుపుతాడో ఎవరికీ తెలియకపోయినా ఆయనకు వివిధ నియోజకవర్గాల్లో ఓట్లేసిన ఓటర్లకు బాగా తెలుసు. బీజేపీలో చేరడం వెనుక గంటా చాలా జాగ్రత్తగా పొలిటికల్ స్కెచ్ గీసాడని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈయన వెనుక తిరిగిన అవంతి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు ఝలక్ కొట్టి సడెన్ గా వైసీపీలోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు అవంతి మంత్రిగా విశాఖ జిల్లాలో అధికారం, పెత్తనం చెలాయిస్తూ గంటాను హేళన చేస్తున్నాడు. అంతేకాదు..గట్టిగా మాట్లాడితే నేను తలుచుకుంటే విశాఖ వీధుల్లో తిరగలేవు.. అంటూ సవాళ్లు కూడా విసురుతున్నాడు. అవంతి దూకుడుకు చెక్ పెట్టాలంటే ఆయన కంటే పెద్ద స్థాయిలో ఉండి సమాధానం చెప్పాలన్నది గంటా ఆలోచనగా చెబుుతన్నారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీలో పార్టీ పదవి వచ్చినా సరే అవంతి స్పీడ్ కు కళ్లెం వేయవచ్చన్నది మరో ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం భీమిలి నియోజకవర్గ పరిధిలో జరిగిన భూ కుంభకోణంపై జెట్ స్పీడ్ తో విచారణ చేయిస్తోంది. ఏ క్షణమైనా సరే దాంటో దొరికినా.. ఇరికించినా..సరే పరిస్థితి ఏమిటన్న సందిగ్థత గంటాలో చాలాకాలంగా ఉందట. అదే బీజేపీలో ఉంటే జాతీయ స్థాయిలో పావులు కదపడం ద్వారా ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కునే..లేదా దొరికే అవకాశం ఉండబోదన్నది కూడా గంటా స్కెచ్ లో భాగమని విశ్లేషిస్తున్నారు.
వైసీపీలోకి వెళితే గనుక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందోనన్నది గంటా కు ఫుల్ క్లారిటీ ఉందట. మంత్రిగా ఉన్నా సరే తెలుగుదేశం ప్రభుత్వంలో తనకు ఉండే స్వేచ్ఛా, స్వాతంత్ర్యం వైసీపీ ప్రభుత్వంలో ఉండదని గట్టి నిర్ణయానికి గంటా వచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. వైసీపీలోకి వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. చేస్తే.. తర్వాత టికెట్ జగన్ తనకే ఇస్తాడన్న గ్యారెంటీ లేదు.. పోనీ ఏదోలా మంత్రి పదవి ఇచ్చేసినా సరే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదన్న భావన బలంగా ఉందట. తెలుగుదేశం పార్టీ నాయకులను, తన నోటితోనే తన సామాజికవర్గానికి చెందిన కాపు నేతలను తిట్టించడానికే ఎక్కవగా వినియోగిస్తారని కూడా గంటా పసిగట్టారట. మరోవైపు చీటికీ మాటికీ..ఈ అవంతితో మాటలు పడటం.. దానికి తిరిగి సమాధానం చెప్పుకోవడం.. జగన్ దగ్గర పంచాయితీలు చేసుకోవాల్సి వస్తుందన్నది కూడా ఓ బలమైన పాయింట్ గా గంటా నమ్ముతున్నారట. ఇలా.. ఒకటేమిటి.. చాలా మైనస్ లున్నాయని ఆయనకు ఆయనే ఎనలైజ్ చేసుకుని చివరకు సేఫ్ ప్లేస్ గా కమలాన్ని ఎంచుకుంటున్నారని ఆయన్నే నమ్ముకుని తిరిగే క్యాడర్ చెబుతోంది.
మొత్తానికి గంటాని చూస్తుంటే.. నాలుగు నెలలు లేట్ అయినా సరే జరగాల్సిన తంతు జరగాల్సిందే అన్నట్లు ఉందనిపిస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీ తన పొలిటికల్ ఫార్ములా ప్రకారం పార్టీ జంప్ చేసే గంటా, ఈసారి వినూత్నంగా ఎలక్షన్స్ అియన తర్వాత జెండా మారుస్తున్నారు.. అంతే. కానీ గంటా లాజిక్ ప్రకారం జంపింగ్ మాత్రం ఖాయంగా జరిగాల్సిందేనని అంతా చెప్పుకుంటున్నారు.
అందుకే కమలం గూటికి గంటా అవంతికి చెక్... పొలిటికల్ సేఫ్ ప్లేస్