అమరావతి రాజధాని కోసం రైతులు రోజు రోజుకూ తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 71వ రోజుకు చేరాయి. రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో ధర్నా...వెలగపూడిలో 71వ రోజు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే అటు పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతుల ధర్నాలు చేస్తున్నారు.
మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని విజయవాడలోని ఆటోనగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, సీపీఐ నేత రామకృష్ణ, జనసేన నేత బత్తిన రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ‘‘అమరావతి కేవలం రాజధాని గ్రామాల సమస్య కాదు, 5 కోట్ల ఆంధ్రుల సమస్య. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని కుటుంబాలు, వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల ప్రస్తావన. ఇది జాతీయ సమస్యగా పరిణమించబోతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. విజయవాడ ఉద్యమాలకు కేంద్రం. నూటికి నూరుశాతం విజయం సాధించి తీరుతాం’’ అని స్పష్టం చేశారు.
ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.పోలీసులపైకి నెపం నెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు, కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదన్నారు.అమరావతి పరిరక్షణ సమితి ఐకాస అధ్యక్షుడు శివారెడ్డి రెండు నెలలుగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని విమర్శించారు. నిరసన తెలిపే వారిని గూండాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.