మన దేశం ఫెడరల్ స్ఫూర్తితో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఏయే అధికారాలు ఉంటాయో స్పష్టంగా ఉంది. ఒకరి అధికారాల్లో ఒకరు జోక్యం ఉండకుండా ఫెడరల్ వ్యవస్థను నిర్మించారు. కానీ, గతంలో కొన్ని కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకుంది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం పరిధిలోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనకు రాష్ట్రాలకు ఏయే అధికారాలు ఉన్నాయో, కేంద్రానికి ఉన్న అధికారాలు ఏంటో స్పష్టమైన అవగాహన ఉంది. తమ ప్రధాని ఫెడరల్ స్ఫూర్తికి గౌరవం ఇస్తారని బీజేపీ నేతలు పదేపదే చెప్పుకుంటుంటారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయాల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఒకసారి వేరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో తమదే రాజ్యం అని, కేంద్రంతో ఢీ కొట్టినా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోలేదు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో గవర్నర్లను సైతం అడ్డుకున్న పరిస్థితులూ ఇటీవల చూశాం. ఈ విషయాల్లోనూ కేంద్రం ఆ రాష్ట్రాల శాంతిభద్రతల వ్యవహారాల్లో కల్పించుకోలేదు. ఇటీవల తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదృతంగా సాగింది. 50 రోజులకు పైగా జరిగిన ఈ సమ్మెలో కార్మికులు కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆశించారు. 50 వేల మంది ఉద్యోగాలు తీసేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా కేంద్రం మాత్రం జోక్యం చేసుకోలేదు. అది రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది.
తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజధాని వ్యవహారంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్రం పరిధిలోని అంశమని, తమ జోక్యం ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టంగా ముందునుంచే చెబుతున్నారు. కానీ, బీజేపీలో కొత్తగా చేరిన సుజనా చౌదరి వంటి నేతలు, బీజేపీతో కొత్తగా పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ వంటి నేతలు మాత్రం కేంద్రం జోక్యం చేసుకుంటుందని, రాజధాని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని పదేపదే అంటున్నారు. ఒక్క ఇంచు కూడా జగన్ రాజధానిని కదిలించలేరని సవాల్ విసిరారు. టీడీపీ కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు. అమరావతి రైతులు సైతం తమకు కేంద్రమే దిక్కు అని ఆశలు పెట్టుకున్నారు. కానీ, జీవీఎల్ ముందునుంచీ చెబుతున్నట్లు రాజధాని రాష్ట్రం పరిధిలోని అంశమని, రాష్ట్రంలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని కేంద్ర హోంశాఖ స్పష్టంగా ప్రకటించింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సమాధానం చెప్పింది.
అయితే, రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చని కేంద్రం చెప్పింది కానీ మూడు రాజధానులు పెట్టుకోవచ్చని కేంద్రం చెప్పలేదని అమరావతి అనుకూల నేతలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రాజధానిని నోటిఫై చేశామని సైతం కేంద్రం ఈ సమాధానంలో అంగీకరించిందని చెబుతున్నారు. కానీ, ఈ వాదనలో తాత్కాలికంగా ధైర్యం చెప్పుకోవడానికి పనికి వచ్చేలా ఉన్నాయి కానీ కేంద్రం జోక్యం ఉండదనేది మాత్రం ఖాయమైంది. ఇదే సమయంలో శాంతిభద్రతల విషయంలోనూ కేంద్రం స్పష్టత ఇచ్చింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు గానూ శాంతిభద్రతల వ్యవహారం రాష్ట్రం పరిధిలో ఉంటుందని, తమ జోక్యం ఉండబోదని స్పష్టంగా తేల్చేసింది. అంతేకాదు, రాష్ట్రం అడిగితే అదనపు బలగాలు పంపించి కేంద్రం సహకరిస్తుందని సైతం పేర్కొన్నారు. ఈ రెండు సమాధానాలతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోదనేది స్పష్టత వచ్చేసింది. మరి, ఇక అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని కోరుతున్న పార్టీలు, నేతలు ఎలా ముందుకు వెళతారో చూడాలి.