ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ అంశాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లాలని శ్రేణులకు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. గవర్నర్‌తోపాటు పోలీసుల వైఖరిపై కోర్టును ఆశ్రయించాలని కూడా భావించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యటనను అడ్డుకోవడంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు.
వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అనుమతి ఉన్న తాను ప్రజా చైతన్య యాత్ర కోసం వస్తే.. ఎయిర్‌పోర్టు వద్దకు వందలాది మంది కార్యకర్తలు ఎలా వచ్చారని ప్రశ్నంచారు. పర్మిషన్ ఉన్న తన పర్యటనను అడ్డుకోవడం ఏంటీ అని నేతలతో చంద్రబాబు చర్చించారు. చేశారు. కాన్వాయ్‌పై దాడి చేసినవారిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టి తీరుతామని చంద్రబాబు నాయుడు భీష్మించుకొని ఉన్నారు. ఒకసారి తన పర్యటనను ఆపారు.. ఇంకెన్ని సార్లు ఆపుతారు అని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో పర్యటించి తీరుతానని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ విశ్వభూషణ్ హరిందన్‌ను టీడీపీ నేతల బృందం కలువబోతోంది. నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు వివరిస్తారు. ప్రభుత్వ తీరును గవర్నర్‌కు వివరించి చర్యలు తీసుకోవాలని కోరతారు.