పెద్ద పూల ప్రదర్శన. పూలలో రకరకాల బొమ్మల తయారీ.. అందులోనూ ఒక పార్క్ మొత్తం రకరకాల పూలతో అలంకరణ. సందర్శకులకు నచ్చినా.. నచ్చకపోయినా.. భారీగా డెకరేషన్. వెరసి అక్కడ చూపించిన లెక్క అరవై లక్షలు. మొత్తం భారీగా బిల్లు గుంజేసి.. వీఎంఆర్డీఏకి చుక్కలు చూపించింది ఆ శాఖ. పైగా.. మేం చేసిందే గొప్పని బీరాలు పలుకుతోంది. ఇంతకీ ఆ పూల కులుకేంటో మీరు చదవండి.
ఉత్సవాల్లో.. పువ్వు..?
విశాఖ ఉత్సవాల సమయంలో జరిగిన తతంగం ఇది. ప్రతి ఏడాది విశాఖ ఉత్సవాలు విశాఖ ఖ్యాతిని తెలపడానికి.. ఇక్కడి ప్రఖ్యాతిని వివరించడానికి నిర్వహిస్తారు. అలాగే రకరకాల ప్రభుత్వ శాఖలు.. విభాగాలు తమ వంతు సామర్ధ్యాలు.. ప్రతిభా పాటవాలు ప్రదర్శించి.. తామేంటో చూపించడానికి ప్రయత్నిస్తారు. దీని ఫలితమే.. మొన్నటి దేవీశ్రీ ప్రసాద్ నృత్యం.. సినిమా ఫ్లావర్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేంచేసిన ఈ కార్యక్రమం ఒక రకంగా ఓకే అనిపించింది. విశాఖను రాజధానిగా ప్రకటిస్తారన్న ఆనందంలో.. సిఎం మాట్లాడకుండా వెళ్లిపోయిన సమయంలో విశాఖ ఉత్సవాలకు ఒకరకమైన భావోద్వేగాలకు వేదికైంది. కానీ.. అదే సమయంలో మరో అట్టహాసం.. యంత్రాంగం చెవికే పువ్వెట్టేసింది.
ఫ్లవర్ షో.. ఫ్లాప్ షో..
60 లక్షలు ఖర్చు
.. భారీగా పూలతో బొమ్మలు.. ఇతర కళా రూపాల డెకరేషన్. ఇదంతా ఏర్పాటు చేసింది నగరంలోని వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ లో. ఇది చూపించి ఏదో అదిరిపోయిదంటూ మీడియా ఊదరింపులు. విశాఖ ఉత్సవాలకు వచ్చిన జనాలు ఆహా పలుకులు..? మొత్తానికి అక్కడ సీన్ చూస్తే.. ఓకే అనిపించేసింది. కానీ.. వీఎంఆర్డీఏ బిల్లు చెల్లించేసరికి బుర్ర గిర్రున తిరిగిపోయింది. అనుకున్న దాని కన్నా.. ఎక్కువే అయ్యేసరికి విశాఖ మెట్రో రీజియన్ డెవెలెప్మెంట్ ఆధారిటీకి పట్టపగలే చుక్కలు కనిపించాయి. లక్షలతో పని జరిగినా.. ప్రయోజనం ఆశించిన స్థాయిలో రాలేదు. ముఖ్యంగా లైటింగ్ సరిగ్గా కుదరలేదు. దీంతో రాత్రిళ్లు పూల షో వేస్ట్ అనిపించేసుకుంది. అనుకున్న ఖర్చు.. ఇలా అరకొటి దాటేసి కనీసం దాని ప్రయోజనం లేకపోయేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. పువ్వులకు ఇంత సీనా అని నవ్వుతారని ఇది బయటకు చెప్పలేక.. లోపల ఉండబట్టక.. అధికార వర్గాలు నోళ్లు నొక్కేసుకుంటున్నాయి.
బీరాల ఇంజనీరింగ్..!
లైటింగ్ సక్రమంగా లేకపోవటంతో ఖర్చు మొత్తం వృధా అయిందని.. వీఎఆర్డీఏ ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖను అడిగింది. దీనికి తామేం తప్పు చేశామంటూ.. ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఎదురు ప్రశ్న వేశారట. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ పనిలో విఫలమవ్వడమే కాక.. ఇలా అడిగే సరికి ఇదే వింత పోకడ అంటూ ఉన్నతాధికారులు.. అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లవర్ షోలో మేం చేసిందే ఎక్కువ అంటూ బీరాలు పలకడంతో ఇక చేసేది లేక.. పై అధికారులకు చెప్పలేక నలిగిపోతోంది వీఎంఆర్డీఏ. అయితే పోయింది ప్రజల సొమ్మేనన్న సోయ ఉన్న కొందరు అధికారులు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఇదే జరిగితే.. ఆ ఇంజనీరింగ్ నాలుగైదు వికెట్లు రాలిపోతాయని సమాచారం. మొత్తానికి పూలు పేర్చేసి.. అరవై లక్షలకు చిల్లెట్టిన ఇంజనీరింగ్ విభాగం తీరుకు వీఎంఆర్డీఏ షాక్ అయిందనేది నిర్వివాదాంశం.