మొక్కలు మెక్కేశారు..!
అయిదు కోట్లు మింగేసిన అటవీ శాఖ అధికారి..?
అనగనగా అది ఓ పెద్ద కంపెనీ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ కంపెనీ మొక్కలు నాటాలని భావించింది. అందుకే ఏళ్ల నుంచీ అదే పనిలో ఉంది. సరే.. ఉన్న పనిలో బిజీగా ఉంటాం కదా.. అని విశాఖ ఉడాకు ఈ పని అప్పగించింది. ఏదో నాలుగైదు మొక్కలు కాదండోయ్. ఏకంగా అయిదున్నర కోట్ల విలువ చేసే మొక్కలు నాటాలని విఎంఆర్డీఏకి బాధ్యత అప్పగించింది. ఇక వీఎంఆర్డీఏ ఈ పని తన సంస్థ విభాగంలోని అటవీశాఖకు అప్పచెప్పింది. అక్కడే తప్పు జరిగిపోయింది. ఏకంగా అయిదు కోట్లు ఇద్దరు ముగ్గురు అధికారులు మెక్కేశారు. అదేంటో చూడండి..
మెక్కేసిందిలా..?
అది మొక్కల పెంపకం. పర్యావరణ పరిరక్షణలో ఒక భాగం. దీని కోసం ఒక ప్రముఖ కంపెనీ నిధులు కేటాయించింది. ఆ నిధుల్ని విశాఖలోని విఎంఆర్డీఏకి అప్పగించింది. కానీ.. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలోని అటవీశాఖ అధికారులు మొక్కల పేరుతో కోట్లు మింగేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచీ వచ్చిన "ఫ్రీ" మొక్కల్ని నాటేసి.. ఇటు వీఎంఆర్డీఏ నుంచీ.. అటు కంపెనీ నుంచీ కోట్ల రూపాయలు మాయం చేశారు. మొక్కల పేరుతో అయిదున్నర కోట్లు మెక్కేశారు. నాటాల్సిన మొక్కల లక్ష్యం నాటకుండానే.. మొత్తం డబ్బులు కొట్టేశారు. దీన్ని కుంభకోణం అనాలా..? దగా అనాలా..? ప్రకృతికి చేసిన ఖూనీ అనాలా.? అసలు ఈ మొత్తం ఘటనను ఏమనుకోవాలి.??
వివరంగా ఇలా..!
మొక్కల లెక్క తేలట్లేదు. అటు ఏపీఐఐసి, నిధులు 2.5 కోట్లు. ఇటు ఎన్టీపీసీ (ఈఎంజీ పర్యావరణ పరిరక్షణ), సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ) కింద మూడు కోట్లు. మొత్తం మాయం. నాటాల్సిన మొక్కలు 1లక్ష 20 వేలు. కానీ.. నాటింది 70 వేలు. అది కూడా ఫ్రీగా ఎన్ఆర్ఇజీఎస్ నుంచీ కొట్టేసినవి. ఇలా మొక్కలు నొక్కేసి.. అటు డబ్బు నొక్కేసి.. మెల్లగా మొక్కల సొమ్ము మెక్కేశారు. రెండేళ్ల క్రితం అంటే 2018 డిసెంబర్ లో ప్రాజెక్టు అప్పగించారు. ఇది గతేడాది 2019 ఏప్రిల్ కి పూర్తవ్వాలి. కానీ ఎక్కడా ఇది జరగనేలేదు. అయిదు మీటర్లకు ఒక మొక్క నాటాల్సి ఉండగా.. 50 మీటర్లకు ఒక్క మొక్క కూడా లేదు. అంటే మొత్తం ఎన్టీపీసీ చుట్టుపక్క నలభై కిలోమీటర్ల వైశాల్యంలోనూ ఈ పచ్చదనం ప్రాజెక్టు పాలిపోయింది. కంపెనీ ఇచ్చిన బాధ్యతను సరిగ్గా చేపట్టలేకపోవడానికి కారణం వీఎంఆర్డీఏ అటవీ విభాగమే. పైగా కోట్ల రూపాయలు బొక్కేసిన స్కాం రికార్డును నమోదు చేశారు.
కాంట్రాక్టర్ తో బేరాలు..?
ఈ మొత్తం స్కాంకి కారణమైన కాంట్రాక్టర్ తో బేరాలు ఆడారు. సదరు కాంట్రాక్టర్ కూడా మంచి గిరాకీ అని ఒప్పేసుకున్నారు. తక్కువ ఖర్చు. ఎక్కువ లాభం. పెట్టాల్సిన పెట్టుబడి ఏమీ లేదు. పైగా అధికారులు కూడా బేరాలాడుతున్నారు. ఇంకేముంది. కాంట్రాక్టర్ రంగంలో దిగిపోయాడు. ప్రాజెక్టు వ్యయంలో మూడొంతులు మింగేశాడు. ఇది ఫిఫ్టీ.. ఫిఫ్టీ పద్దతిలో అధికారులకు కట్టబెట్టేశారు. మొక్కుల కొనాల్సిన పనిలేదు. అవి ఎన్ని నాటాలో కూడా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఈ మొక్కల వ్యవహారంలో బొక్కలు కనుక్కునే నాధుడే లేడు. మొత్తం నొక్కేయాల్సిన టైం వచ్చిందనుకున్నాడు. అంతే అధికారులతో కలిసి నొక్కేశాడు. అసలు కాంట్రాక్టర్ కి బిల్లు ఇచ్చెటప్పుడు మొత్తం అమౌంట్ లో 2.5% కట్ చేయాలి. కనీసం అది కూడా ఇక్కడ జరగలేదు. పైగా సెక్యురిటి డిపాజిట్ 7.5% కట్ చేసి పెట్టుకోలేదు. ఇలా అంతా కాంట్రాక్టర్ కి అనుకూలంగానే అధికారులు కూడా వంతపాడారు. కారణం అప్పటి ఇన్ఛార్జి ఎఫ్ఆర్వో ఆ కాంట్రాక్టర్ కి చిరకాల మిత్రుడు. ఇద్దరు ఫ్రెండ్షిప్ మాటున ఈ ప్రాజెక్టులో చక్కగా అక్రమార్జన చేశారు.
చక్రం తిప్పిన ఏవో....!
మొక్కలు మెక్కేసిన స్కాంలో ఒక అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ మేరకు ఆయనే మింగేసాడని దాదాపు ఖరారు కూడా అవుతోంది. అప్పుడు ఆయన డిప్యుటేషన్ పై ఎఫ్ఆర్వో గా వచ్చారట. అంతకుముందు ఆయన వ్యవసాయ శాఖ ఏవోగా పనిచేశారు. ఇక్కడ డిప్యుటేషన్ పై విఎంఆర్డీఏలో బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఈ ప్రాజెక్టుకు పనిచేయాల్సిన అవసరం పడింది. ఇంకేంముంది మొక్కల లెక్కలే తేలకుండా సర్వం చుట్టేశారట. ఇదే కాక ఇప్పుడు వీఎంఆర్డీఏలోనే ఉంటున్న ఈయనగారు అక్కడి అటవీ విభాగం.. ఇతర అధికారుల్ని బెదిరిస్తున్నారట. తన విషయం చెబితే ఏం చేయడానికైనా సిద్ధం అంటూ తెగేసి మరీ చెబుతున్నారని పాపం వీఎంఆర్డీఏ సిబ్బంది కొందరు వణికిపోతున్నారు.
పొల్యూషన్ చెబితే..?
ఈ విషయం మామూలుగా బయటకు రాలేదు. ఎన్టీపీసీ అప్పగించిన ఈ మొక్కల పెంపకం ప్రాజెక్టు సరిగ్గా లేదన్న విషయం మొదట ఎవరికీ తెలియదు. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మొక్కల ఎక్కడా కనిపించట్లేదని తెలుసుకుని.. ఎన్టీపీసీకి మొదట చెప్పారు. అయితే అప్పటికే ఇది వీఎంఆర్డీఏ పరిధిలో ఉండటంతో ఎన్టీపీసీ పొల్యూషన్ బోర్డ్ అధికారులకు ఆ మేరకు సమాచారం అందించారు. దీంతో పీసీబీ అధికారులు అప్పటి వీఎంఆర్డీఏ కమిషనర్ బసంత్ కుమార్ కు విషయం చెప్పారు. ఒక కీలకమైన సమావేశంలో అధికారులు అందరూ ఉండగానే కమిషనర్ ఎదుట ఈ పంచాయితీ పెట్టారు. దీనిపై వెంటనే వివరాలు అందించాలని సెక్రటరీని వీసీ ఆదేశించడంతో బండారం బయటపడింది. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి చెప్పిన సమాచారంతో తీగ లాగిన అధికారులకు డొంక అక్కడే ఉందని అర్ధమైంది. డొంక కూడా గట్టిగానే కదిలింది.
విచారణ కమిటి..!
ఈ స్కాం విషయం తెలిసిన వెంటనే అప్పటి వీసీ బసంత్ కుమార్ విచారణ కమిటీ వేశారు. కమిటీ అయితే వేశారు గానీ.. అందులోనే అసలు వ్యక్తి కూడా ఉండటంతో ఏదో మొక్కుబడిగా సాగిపోయిందట. కమిటీ నివేదికలో.. మొక్కలు సరిగ్గా నాటలేదని.. అందులో నాణ్యతా లోపం.. మొక్కల సంరక్షణ.. వంటి కీలకమైన అంశాల పరిగణలోకి తీసుకోలేదని మాత్రం క్లియర్ గా ఉంది. స్కాం జరిగిందని తెలిసిందే తప్ప.. ఎంత నొక్కేశారనే విషయం మాత్రం తేలలేదు. ఇది జరిగిపోయి రెండేళ్లవుతున్నా.. ఇంతవరకు బాధ్యుల పై చర్యలు లేవు. స్కాంకు కారణమైన అధికారిని మాత్రం అదే సీట్ లో ఉండటం గమనార్హం. నిజానికి సదరు అధికారిని సస్పెండ్ చేయాలి. ఆ బాధ్యత వేరొకరికి ఇవ్వాలి. కానీ అది జరగలేదు. దీంతో అదే సీట్లో దర్జాగా కూర్చని.. అక్రమాన్ని సక్రమం చేయడానికి నానా అడ్డదారులు తొక్కుతున్నారు సదరు అధికారి. తన అవినీతిని నీతి చేసేందుకు ప్రయాస పడుతున్నారు. అడ్డొచ్చిన వాళ్లని బెదిరిస్తూ తన లైన్ క్లియర్ చేసుకుంటున్నాడట.
ఇది తేలదేమో..!
జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అటు ఎన్టీపీసీ కూడా దీనిపై పెద్దగా మాట్లాడటం లేదు. ఇది వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్నదనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విషయాన్ని మరిచిపోయినట్లుంది. ఇక ఇదే అంశాన్ని త్వరితగతిన బట్టబయలు చేయాల్సిన వీఎంఆర్డీఏ బాధ్యులపై చర్యలకు మీనమేషాలు లెక్కేస్తోంది. ఇప్పటికే విచారణ కమిటీ నివేదిక సిద్ధంగా ఉంది. అది వీసీ టేబుల్ పైనే ఉంది. ఒక్క నిర్ణయం చాలు. తప్పు చేసి కోట్లు మింగేసిన అధికారుల్ని అత్తారింటికి పంపడానికి. కానీ.. ఇదేం జరగడం లేదు. అంటే బాధ్యులు అందర్నీ భయపెట్టినట్టేనా.? చివరికి వీసీని కూడా ప్రభావితం చేయగలిగినట్టేనా..? ఇది ఎప్పటికి తేలుతుంది.? సమాధానం ఎవరు చెప్పాలి..?
కమిషనర్ ఆగ్రహం..!
ఇప్పటికే ఈ విషయం పై వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు ఆగ్రహంగా ఉన్నారు. గత కమిషనర్ ఈ స్కాం విషయం బయటపెట్టాలని వేసిన విచారణ కమిటీని కూడా సదరు అధికారి మేనేజ్ చేశాడని చెబుతున్నారు. ఈ విషయం తొక్కిపెట్టి.. అధికారుల్ని భయపెట్టి.. జాలీగా ఉన్నారని కూడా ఆఫీస్ లో చర్చ నడుస్తోంది. ఈ విషయం ఆనోటా ఈ నోటా వెళ్లి.. వీసీ వరకూ చేరింది. దీంతో వీసీ సదరు ఫైల్ త్వరితగతిన తేల్చాలని ఆదేశాలు ఇచ్చారని సమాచారం. కానీ.. ఆ అధికారి మాత్రం తనకేం కాదని.. తనను ఎవరూ ఏం చేయలేరని.. తోటి అధికారుల దగ్గర బీరాలు పలుకుతున్నారట. కమిషనర్ కూడా ఈ అంశం పై ఇచ్చిన ఆదేశాలు ఏ మేరకు ఫలిస్తాయో తాను చూస్తానని ఆయన అన్నట్టు.. వీఎంఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.
స్నేహమేరా.. కారణం..!
ఈ అక్రమానికి ఒక స్నేహం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ స్కాం సూత్రధారి ఒక అధికారి అయితే పాత్రధారి కాంట్రాక్టర్. ఈ ఇద్దరూ కూడా జిగిరీ దోస్తులట. ఒకే బెంచ్ క్లాస్ మేట్స్ అని సమాచారం. వీరిద్దరి బంధం కారణంగానే.. ఈ అక్రమం సాఫీగా సాగిందట. దీనిపై వచ్చే సంచికలో వివరాణాత్మక కధనం.
BOX
తప్పించుకోలేరు : సెక్రటరీ
మొక్కల లెక్క విషయంలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తున్నామని వీఎంఆర్డీఏ సెక్రటరీ అంటున్నారు. ఇంటర్నల్ కమిటీ సభ్యులు విశారణ పూర్తి అయ్యిందన్నారు. మిగతా విభాగాలు కూడా ఈ అంశం పై సీరియస్ గా ఉన్నారని అన్నారు. అన్ని డిపార్ట్మెంట్లతో పాటు.. తమ విభాగం కూడా ఏం జరిగిందో తెలుసుకుందన్నారు. తమ టీం, ఏపీఐఐసి, అటవీ శాఖ స్పెషల్ టీం దీనిపై విచారణ చేపట్టిందని చెప్పారు. తప్పు చేసిన బాధ్యులు ఎలాంటి వారైనా తప్పించుకోలేరని.. అంత తేలికగా విడిచిపెట్టమని చెప్పారు.