భారత సీఈవోలకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సలహా ఇచ్చారు. డిజిటల్ యుగంలో దూసుకు పోయేందుకు అందరూ తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఈ సామర్థ్యాలను భారత సీఈవోలు అలవర్చుకోవాలన్నారు. సత్య నాదెళ్ల తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ముంబై లో ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమ్మిట్ లో మాట్లాడారు.
నేను ఇతర సీఈవోలతో మాట్లాడిన సందర్భంలోను ఇదే చెబుతానని అసోసియేషన్ ద్వారా వచ్చే టెక్నాలజీ తో మీరు ఎప్పుడు కూల్ గా ఉండలేరని చెబుతానని ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు. మీరు సొంతగా మీ సాంకేతిక సామర్థ్యాన్ని నిర్మించుకోవడం చాలా ముఖ్యమైన అంశమని రానున్న రోజుల్లో ఇది ఎంతో కీలకం అన్నారు.
డిజిటల్ టెక్నాలజీ చిన్న పెద్ద ఇలా అన్ని రంగాల్లోను కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. భారత్ లో సాప్టువేర్ ఇంజినీర్లకు 72 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ పరిశ్రమకు వెలుపల ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మొబైల్ విప్లవం కన్స్యూమర్ ఇంటర్నెట్ పెరగడం చూశామన్నారు. రాబోవు పదేళ్ల లో మరింతగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఇది మరింత సమగ్ర వృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఇండియన్ స్టార్టప్స్ నిర్మించిన అగ్రిగేటర్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుతూ.. అత్యంత విజయవంతమైన వ్యాపార నమూనా ఇది అన్నారు. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణం గా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని యువత కు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అలాగే త్వరగా నేర్చుకునే తత్వం ఉందన్నారు. కానీ దానిపై వారికి శిక్షణ అవసరమని చెప్పారు.