బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదు - ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా
దేశవ్యాప్తంగా ఏడాది కాలంగా ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. అయితే విపక్షాలు మాత్రం ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ సవాలక్ష సందేహాలతో ఈసీని ఇబ్బందిపెడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఈవీఎంల గురించిన సందేహాలను నివృత్తి చేస్తూనే వుంది ఈసీ. తాజాగా మరోసారి ఈసీ తన వైఖరి స్పష్టం చేసింది. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా పేర్కొన్నారు. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఈసీ  సునీల్‌ ఆరోరా ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఇటువంటి ఆరోపణలను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్‌ కోడ్‌పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, రాజకీయపార్టీలు సందేహాలు వ్యక్తం చేయడం మామూలే అన్నారు. ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తడం మామూలేనని, వాటిని ట్యాంపరింగ్‌ చేసేందుకు ఎలాంటి  అవకాశం లేదన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో సహా పలు పార్టీలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తెలిసిందే. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు ఈవీఎంల వాడకాన్ని సమర్థించాయని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ ఎన్నికలు ముగిశాక ఓటింగ్‌ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశం అయింది. ఆప్ నేతలు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరచిన చోట తమ పార్టీ కార్యకర్తలతో భద్రత కూడా ఏర్పాటుచేశారు.

లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే ఓటింగ్‌ శాతం వెల్లడించిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో పోలింగ్‌ వివరాలు ఎందుకు ఆలస్యం చేసిందని ఆప్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసీ కూడా ఈవీఎంలపై తన వైఖరి స్పష్టం చేసింది. భవిష్యత్తులో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు అవకాశం లేదని పేర్కొంది.