జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారికి కేటాయించబడిన మండల హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి నాగార్జున సాగర్ తెలిపారు. జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి అయిందని తెలిపారు. తిరస్కరించబడిన నామినేషన్ల పై అప్పీలు నేడు చేయవచ్చునని తెలిపారు. అప్పీళ్ళ పరిష్కారం 14వ తేదీ జరుగుతుందని తెలిపారు.అభ్యర్థిత్వాల ఉపసంహరణకు ఆఖరు తేదీ 14వ తేదీ అని తెలిపారు. ఆ రోజే పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దశ పూర్తి అయినందున, ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బందికి శిక్షణను ఇవ్వాలని తెలిపారు. ప్రత్యేకించి బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికను నిర్వహించే విధానాన్ని, ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా నేర్పించాలని తెలిపారు. పోలింగ్ రోజు నింపవలసిన ప్రొఫార్మాలపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. లేకపోతే కౌంటింగ్ సందర్భంగా ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.
రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు అయిన తహసీల్దార్లు, ఎంపీడీవో లతో సమన్వయం చేసుకొని ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా జిల్లాకు పరిశీలకులుగా నియమించబడిన సీనియర్ అధికారులు రేపు క్షేత్రస్థాయిలో పర్యటించి, తనిఖీలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అందుబాటులో వుండండి - జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి నాగార్జున సాగర్