ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అప్పన్న ఆలయంలో రాజకీయ వేడి రాజుకొంది.ఇప్పటివరకు ఆలయ అనువంశిక ధర్మకర్తగా వున్న మాజీ మంత్రి అశోకగజపతిరాజు కి ప్రభత్వం భారీ షాక్ ఇచ్చింది.ఆయన స్థానంలో అతడి అన్న ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతి రాజు ను
నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.బుధవారం ఉదయాన్నే ఆమె ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నిరాడంబరంగా ప్రమాణస్వీకారం చేసారు.కొద్ది మంది కుటుంబ సభ్యులు,ఆలయ ఈవో,ప్రధాన అర్చకుల సమక్షంలో
సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మెన్ గా పూసపాటి సంచయిత గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయానికి ఇప్పుడు సంచిత గజపతిరాజును ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించడం రాజకీయంగా చిచ్చు రగిలిస్తోంది. ఈ నియామకం వెనుక పెద్ద రాజకీయ వ్యవహారం నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది.సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అనువంశిక ధర్మకర్తగా ఉన్న పూసపాటి వంశీయులే కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. గతంలో పూసపాటి ఆనంద గజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ఉండేవారు. ఆయన మరణం తర్వాత అనువంశిక ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి, టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతి రాజు ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఆకస్మికంగా సింహాచలం ట్రస్టు బోర్డును నియమించారు. రెండు రోజుల క్రితం ఈ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా ప్రమాణ స్వీకారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అనూహ్యంగా బుధవారం ఉదయం స్వర్గీయ ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సమాచారం తెలుసుకున్న వారంతా ఇప్పుడు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును పక్కన బెట్టి, ఆయన సొదరుడు ఆనంద గజపతి కుమార్తెను ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ గా నియమించడం వెనుక ఎటువంటి రాజకీయం ఉందన్న అంశం చర్చకు దారి తీస్తోంది. ఆనంద గజపతి, అశోక్ గజపతి ఇద్దరూ స్వయానా సొదరులే అయినప్పటికీ, ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలుండేవి. అశోక్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుండగా, ఆనంద్ కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో పనిచేసారు. అయితే ఆనంద గజపతి మొదటి వివవాహం తర్వాత రెండోవివాహం కూడా చేసుకున్నారు. ఉమా అనేమహిళ వివాహం చేసుకోవడంతో ఆమె పేరు కూడా ఉమా గజపతిగా మారింది. ఆ ఉమా గజపతి రాజు రెండో కుమార్తె ఈ సంచిత గజపతి. ప్రస్తుతం ఈమె ఢిల్లీలోనే ఉంటూ అక్కడ బీజేపీలో చురుగ్గా పాల్గొంటోంది. రాజకీయంగా బీజేపీ కూడా ఆమెకు ప్రాధాన్యతను ఇస్తోంది. గత ఎన్నికల సమయంలో సంచిత గజపతి విశాఖలో బీజేపీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించింది. అయితే సంచితకు, తన పిన తండ్రి అశోక్ గజపతి కుటుంబంతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేనట్లు తెలుస్తోంది. ఇక్కడి వ్యవహారాలకు సంచిత కూడా చాలా దూరంగానే కొనసాగింది. అయితే బీజేపీలో చేరిన తర్వాత విశాఖ, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించడం, స్వచ్ఛభారత్ వంటి కార్యకలాపాలను చేపట్టింది. తొలి నుంచి స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న సంచిత, బీజేపీలో చేరిన తర్వాత జోరు పెంచడమే కాకుండా విశాఖకు కార్యకలాపాలను విస్తరించింది. అయితే ఇప్పుడు సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సంచిత రావడం వెనుక పెద్ద రాజకీయమే నడుస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అశోక్ గజపతి అనువంశిక ధర్మకర్తగా, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొనసాగుతుండగా, ఆయన కుమార్తె అదితి గజపతి తండ్రి బాధ్యతలను తనే పర్యవేక్షించేది. సింహాచలం పుణ్య క్షేత్రం అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునేలా ఆమె కీలకంగా వ్యవహరించింది. అంతేగాక టీడీపీలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి అదితి గజపతి గత ఎన్నికల్లో పోటీ చేసింది. కాకపోతే ఓటమి పాలైంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రావడంతో టీడీపీలో ఉన్న అశోక్ కు, ఆయన కుమార్తె అదితికి చెక్ పెట్టేందుకు గాను ఎప్పుడో ఈ ప్రాంతానికి దూరమైన ఆనంద గజపతి వారసులను తెర మీదకు తెచ్చారనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ ను పక్కన పెట్టి , ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సంచిత గజపతిని తెర మీదకు తీసుకురావడం ద్వారా ఆలయం పరంగా, రాజకీయంగా, గజపతిరాజుల కుటుంబం పరంగా భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
రాజకీయ కక్ష సాధింపు
రాత్రికి రాత్రే జీవో ఇచ్చి మాజీమంత్రి అశోక్ గజపతిరాజు స్థానంలో సంచిత గజపతి రాజు కి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇవ్వడం కచ్చితంగా రాజకీయ కక్షసాధింపు అని టీడీపీ నగర ఉపాధ్యక్షుడు,సింహాచలం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబెర్ పాశర్ల ప్రసాద్ ఆరోపించారు.ఆలయ అనువంశిక ధర్మకర్త ను అవమాన కరంగా పంపించాలనే దుర్బుద్దితోనే ఇలా చేసారని అన్నారు.టీడీపీ నేతలు ఎక్కడా ఎటువంటి పదవులలో ఉండకూడదని జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.పార్టీ నిర్ణయం మేరకు తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు
రాత్రికిరాత్రి జీవో ఇచ్చిన ప్రభుత్వం - భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు