ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలి - ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాణావరణంలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  రానున్న జిల్లాపరిషత్, పురపాలక, నగరపాలక, గ్రామ పంచాయితీ ఎన్నికలుకు పరిశీలకులుగా వచ్చిన ఆయన కలెక్టరు సమావేశమందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో శిక్షణ పొందినట్లయితే ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించ గలుగుతారన్నారు. పురపాలక, గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణపై వివిధ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకే నెలలో మూడు, నాలుగు ఎన్నికలను నిర్వహించ వలసి వచ్చినందున కార్యాచరణ ప్రణాళికా యుతంగా వుండాలన్నారు. పోలింగ్ కు ముందు, నిర్వహణ సమయంలో, పోలింగ్ అనంతరం చేయవలసిన పనులను విభజించు కోవాలన్నారు.  చాలా కాలం తరువాత బ్యాలట్ బాక్సులను, బ్యాలట్ పేపర్లను ఉపయోగింస్తున్నందున  అప్రమత్తంగా వుండాలన్నారు.  తొంభై శాతం మందికి దీనిపై అనుభవం ఉన్నప్పటికీ ఉదాశీనంగా ఉండరాదన్నారు.   ముఖ్యంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు యంత్రాంగంపై నమ్మకం కలిగించే విధంగా విధులు నిర్వర్తించాలన్నారు.  ఓటర్ల జాబితా, నిబంధనల అమలు పక్కాగా వుండాలన్నారు.  ఎన్నికల నిబంధనలపట్ల అందరికీ అవగాహన కల్పించడం, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం మూలంగా యంత్రాంగం పై  నమ్మకం కలుగుతుందన్నారు. ప్రెస్ అండ్ మీడియా సహకారం ఎంతగానో ఉపయోగ పడుతుందని, టీవీలు, దినపత్రికలలో వచ్చే వార్తల ఆధారంగా చర్యలు చేపట్టినట్లయితే ఎన్నికలు నిష్షక్షపాతంగా  నిర్వహించ వచ్చిని చెప్పారు.  



 జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ రిటర్నింగ్, నోడల్, జోనల్ అధికారులు, పోలింగ్ అధికారులు, సిబ్బంది విధులను తు.చ. తప్పకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు.  మాన్యుల్ పట్ల పూర్తి అవగాహన కలిగించుకోవాలన్నారు.  ఎన్నికలకు సంబంధించి ఏయే తేదీలలో జరిగే ఎన్నికల ప్రక్రియను గూర్చి తెలిపారు.  ఆయా దినాలలో చేయవలసిన పనులను, ఏ విధంగా నిర్వహించాలో చెబుతూ శిక్షణా కార్యక్రమాలను శ్రద్దగా చేసినట్లైతే విధి నిర్వహణ సులువుగా వుంటుందన్నారు.  సూక్ష్మపరిశీలకులకు, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు, పోలింగ్ సామగ్రి తరలింపు, చేరవేత, రూట్లు, జోన్లు, పోస్టల్ బ్యాలట్,  బ్యాలట్ ప్రింటింగ్, ఏవిధంగా చేయాలన్నదానిపై సవివరంగా తెలిపారు.  ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా  చర్యలు తీవ్రంగా వుంటాయని గమనించాలన్నారు. పి.వో., ఏ.పి.వో.లకు శిక్షణ పూర్తి స్థాయిలో వుండాలని, పోలింగ్ బందోబస్తు పటిష్టంగా జరిగేలా చూడాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం  స్టేషనరీ ఏర్పాటు చేయాలన్నారు.  స్ట్రాంగ్ రూమ్ ల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ గూర్చి తెలియజేశారు.  జిల్లా వ్యయపరిశీలకులు నందిని మాట్లాడుతూ ప్రకటనలు, పత్రికలలో ప్రకటనలు, కరపత్రాలు, బ్యానర్లు, వాహనాలు మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని, వివిధ దినపత్రికలలో వచ్చే పెయిడ్ న్యూస్ ను పరిగణనలోనికి తీసుకోవాలన్నారు.  జాయింట్ కలెక్టరు శివశంకర్ మాట్లాడుతూ పోలింగ్ కు కావలసిన సామగ్రిని అధికారులకు, సిబ్బందికి అందించే ఏర్పాట్లను గురించి వివరించారు.  జాయింట్ కలెక్టరు వేణుగోపాల రెడ్డి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పరిస్థితులను గూర్చి వెల్లడించారు.  
 ఈ సమావేశంలో జివియంసి అదనపు కమిషనర్ తమీమ్ అన్సారియా, పి.కోటేశ్వరరావు, సహాయ కమిషనరు ఐటిడిఎ పి.వో. డి.కె.బాలాజీ, పాడేరు సబ్ కలెక్టరు ఎస్.వెంకటేశ్వర్, జెడ్.పి. సి.ఈ.ఓ. నాగార్జున సాగర్, డిపివో గోవిందరావు, డి.ఆర్.డి.ఎ. పి.డి. విశ్వేశ్వరరావు, ఆర్డీవోలు పెంచలకిషోర్, సీతారామారావు, లక్ష్మీశివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.