కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండగా దాని నివారణకు మెడిసిన్గా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వినియోగిస్తున్నారు. కరోనా పాజిటివ్ బాధితులకు కరోనా చికిత్సల్లో వాడే యాంటీ మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ను వినియోగిస్తున్నారు. అయితే ఈ టాబ్లెట్లను అతిగా వాడితే గుండె రిథమ్ పంపింగ్లో తేడా వస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. ఆకస్మిక గుండెపోటుకు దారితీసే ప్రమాదం కూడా ఉందని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు చెబుతున్నారు. ఈ అత్యావసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా క్లోరోక్విన్ను వినియోగిస్తూ పరోక్షంగా కృత్రిమ కొరతకు కారణమవుతున్నారని నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ ఆర్వీకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.
కరోనా వైరస్ కు వాక్సిన్ లేక పోవడంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ కొంత ఫలితం ఇస్తున్నట్లు ఐసీఎంఆర్తో పాటు అంతర్జాతీయ సంస్థలు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి తొలిరోజు రెండుసార్లు 400 ఎంజీ చొప్పున ఆ తర్వాత వారానికి ఒకటి (400 ఎంజీ) చొప్పున ఏడు వారాలు వాడాలని ఐసీఎంఆర్ సూచించింది. అయితే పెద్దవారు మాత్రమే దీన్ని వాడాలి. జలుబు జ్వరం తీవ్రతను బట్టి అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్ కాంబినేషన్తోనూ క్లోరోక్విన్ వాడొచ్చని సూచించింది. ఈ కాంబినేషన్ మందులతో కరోనా వైరస్ తగ్గే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. వాటి ఫలితమే తెలంగాణలో ఇప్పటికే 96 మంది కోలుకున్నారని వెల్లడించింది. దీంతో ఆ మందులకు డిమాండ్ పెరిగిందని తేల్చారు.
కరోనా సోకిన వ్యక్తులకు వారి సంబంధితులకు అనుమానితులకు ఇదే మందును వాడుతున్నారని తెలిపారు. ఈ సమయంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు స్టాఫ్ నర్సులు పారమెడికల్ స్టాఫ్ తదితరులతో పాటు సర్వేలెన్స్ ఆఫీసర్లకు శానిటైజ్ చేసే పారిశుద్ధ్య కార్మికులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ను సిఫార్సు చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని వాడాలని ఆయన సూచిస్తు్న్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఎలాంటి వ్యాధులు లేకపోయినా ముందస్తుగా ఈ టాబ్లెట్లను కొని వాడడడంఓ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల సిఫార్సు లేకుండా క్లోరోక్విన్ వాడితే గుండె రిథమ్ సహా పంపింగ్ లోనూ తేడా వస్తుందని కంటి రెటీనా దెబ్బతింటుందని ఈ సందర్భంగా నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ ఆర్వీకుమార్ తెలిపారు. కరోనా పాజిటివ్ బాధితులకు కూడా ఈసీజీ తీసి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతుంటారని హైరిస్క్ జోన్ లో ఉన్న వారు కాకుండా ఇతరులు కూడా ఈ మందులు ఇష్టానుసారం వాడడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలా వాడితే గుండె లయ తప్పి గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణలో తేడాలు ఏర్పడతాయని దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే వైద్యుల సలహాలతో మందులు వాడాలని ఆయన స్పష్టం చేశారు.