చైనాలో మళ్లీ పడగవిప్పిన కరోనా.. నలుగురి మృతి, భారీగా కొత్త కేసులు

పుట్టింట్లో కరోనా వైరస్ మళ్లీ కలవరం రేపుతోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులేమీ నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న చైనాలో మళ్లీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవించడం అక్కడి అధికారులను కలవరపరుస్తోంది. తాజాగా మెయిన్‌ల్యాండ్ చైనాలో కొత్తగా 31 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఇద్దరు రోగులకు స్థానికంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యుల పరీక్షల్లో తేలింది. అక్కడా 24 గంటల వ్యవధిలో నలుగురు కరోనా వైరస్‌తో పోరాడుతూ మరణించారు.


చైనాలో 81,322 మందికి కరోనా వైరస్ సోకగా.. 3,322 మంది మరణించారు. మూడు నెలలు దాటినా చైనాలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గక పోవడంతో చైనా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో విదేశీ ప్రయాణాలపై చైనా నిషేధం విధించింది. వేరే దేశస్థులెవరూ తమ దేశంలోకి రావొద్దని చైనా హెచ్చరిస్తోంది. వైరస్ పుట్టిన వూహాన్‌లోని మార్కెట్‌‌లో మళ్లీ తెరుచుకున్నప్పుడే ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ అన్ని రకాల జంతువుల మాంసం విక్రయాలు మొదలుకావడం, వాటి కొనుగోలుకు చైనీయులు క్యూ కట్టడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో చైనాలోని షెన్‌జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులకు తినడాన్ని నిషేధించారు. పాములు, బల్లులు, పిల్లులు, కుక్కలతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగంపై షెన్‌జెన్‌లో నిషేధం విధించడం ఇదే తొలిసారి.