గ్రీన్‌ జోన్లలో సడలింపులు.. ఆర్థిక కార్యకలాపాలకు జగన్ సర్కార్ పచ్చజెండా




 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం గుర్తించిన గ్రీన్‌ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తగిన రక్షణ చర్యలతో ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వివిధ సంస్థలు, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు అనుమతులిచ్చింది. ఇందుకు ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలో పేర్కొంటూ సమగ్ర విధివిధానాలను వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని విడుదల చేశారు. సంబంధిత అధికారులంతా ఈ కార్యకలాపాల్లో ఉల్లంఘనలు జరగకుండా చూడాలని నిర్దేశించారు.







 



ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ మార్గదర్శకాలను ‘రీస్టార్ట్‌’ అన్న ఏడు అక్షరాలతో విశ్లేషించారు. ఆయా సంస్థల ఆపరేషన్ల రిజిస్ట్రేషన్‌, అవగాహన కార్యక్రమాలు, సామాజిక దూరం పాటించడం, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో స్క్రీనింగ్‌ చేయడం, ఒకరితో ఒకరి భేటీలు నివారించడం, నిఘా, ట్రాకింగ్‌ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

గ్రీన్‌ జోన్లలో పారిశ్రామిక కార్యకలాపాల ప్రారంభంపై కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తూ పరిమిత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తహసీల్దార్‌, ఎంపీడీవో, కార్మిక శాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రెడ్‌ జోన్ల పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలకు మినహాయింపులు వర్తించవన్నారు. గ్రీన్‌ జోన్లలో లాక్‌డౌన్‌ మినహాయింపులకు సంబంధించి పోలీసులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ ఆదేశించారు.

వీటన్నింటికీ సడలింపులు..


  • అన్ని మిల్లులు (ధాన్యం, నూనె, పప్పులు), పాల ఉత్పత్తి కేంద్రాలు, ప్యాకేజీ నీటి కేంద్రాలు, బిస్కట్లు, జ్యూస్‌లు వంటి ఆహార తయారీ పరిశ్రమలు.. మందులు, సబ్బులు, డిటర్జెంట్ల కంపెనీలు, మాస్కుల తయారీ, ప్యాకేజీ కేంద్రాల వంటివి పనిచేయవచ్చు.

  • గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టు పనులు, భవన నిర్మాణాలకు.. ఐటీ సంస్థల్లో 50 శాతం ఉద్యోగులతో పనులకు, అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతి

  • వాహనాల మరమ్మతు కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన దాబాలను నిబంధనల మేరకు నిర్వహించుకోవచ్చు.

  • 30 నుంచి 40 శాతం రవాణా సామర్థ్యంతో వాహనాల్లోనే ఉద్యోగులను తరలించాలి.

  • ఆయా సంస్థలన్నీ వారి ప్రాథమిక సమాచారంతో నిర్ణీత ఫారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ప్రభుత్వం విడుదల చేసిన జీవోఆర్‌టీ నంబర్‌ 88, (18- 4- 2020)లో ఉన్నాయి.