దిశ పోలీసులకు కరోనా ఎఫెక్ట్


అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు సాయం చేసిన దిశ పోలీసులు కరోనా ముప్పు ముంగిట నిలబడ్డారు. తాము సాయం చేసిన మహిళ కరోనా వైరస్ కారణంగా మృతి చెందడంతో విజయవాడ దిశ పోలీసు స్టేషన్ ఎస్సై, సైబర్ నిపుణుడుతో సహా పోలీస్ కంట్రోల్ రూంలోని దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం గృహ నిర్బంధంలోకి వెళ్లాల్సివచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న అనారోగ్యంతో నగరంలోని గ్లోబల్ ఆసుపత్రికి భర్తతో కలిసి వచ్చిన 55 ఏళ్ల మహిళను ఓపీ విభాగం పనిచేయడం లేదని, ప్రభుత్వాసుపత్రికి వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. వాహన సదుపాయం లేకపోవడంతో కంట్రోల్ రూం వద్ద నిలబడివున్న దంపతులకు దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తమ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న సైబర్ నిపుణుడి సహాయంతో సొంత వాహనంలో దంపతులను పాత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కేవలం గర్భిణీలకు మాత్రమే వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో తొలుత కొత్త ప్రభుత్వాసుపత్రికి, తదనంతరం ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లిన మహిళ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతి చెందిన మహిళకు కోవిడ్ 19 పరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దిశ పోలీసులు సాయం చేసిన మహిళ కరోనాతో మృతి చెందడంతో ప్రభుత్వాధికారులు అప్రమత్తమయ్యారు. మృతురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లిన  ఎస్సై, సైబర్ నిపుణుడుతో సహా, వీరిరువురితో కలసి విధులు నిర్వర్తించిన దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ హోం క్వారంటైన్ కు పంపించారు. ఎస్సై, సైబర్ నిపుణులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఫలితాల కోసం మొత్తం పోలీసు సిబ్బంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మానవతా దృక్పథంతో సాయం చేసిన పోలీసు సిబ్బంది కరోనా ముప్పు ముంగిట నిలబడటం చర్చనీయాంశంగా మారింది.