మందకొడిగా రేషన్ సరఫరా - మొరాయిస్తున్న ఈపాస్ మిషన్లు.

రేషన్ డిపోల ద్వారా మూడో విడత సరుకులు సరఫరా మందకొడిగా సాగుతోంది. రేషన్ డిపో లలో బుధవారం నుంచి బియ్యం, పప్పు సరఫరా మొదలైంది. ఈపాస్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉదయం 6 గంటలకే డీలర్లు డిపో లకు చేరుకున్నారు. అప్పటికే కార్డు దారులు డిపోల వద్ద వేచి ఉన్నారు. సర్వర్ మోరాయించడంతో ఆలస్యంగా పంపిణీ మొదలైంది. పది గంటల వరకు ఈపాస్ సర్వర్కు కనెక్ట్ కాకపోవడంతో కార్డుదారులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.  పదకొండు గంటల వరకే ప్రభుత్వం సమయం ఇవ్వడంతో డిపోల వద్ద వేచి ఉన్న కార్డుదారులు ఇబ్బంది పడ్డారు .ఇక్కడ వేచి ఉన్న వారందరికీ ఇచ్చాకే డిపో మూయాలని డిమాండ్ చేశారు. దీంతో అందరికీ కార్డుదారులకు నచ్చచెప్పి వచ్చినవారికి పంపిణీ చేశారు.జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. డిపోల వద్ద ఉన్న కార్డుదారులు ఈపాస్ కనెక్ట్ కాకపోవడంతో గుంపులుగా చేరి మాట్లాడుకోవడం కనిపించింది. వీరిలో ఎక్కువ మంది వ్రృద్దులే ఉండడంతో భౌతిక దూరం పాటించాలి అని డీలర్లు హెచ్చరిస్తూ వచ్చారు. గత రెండు విడతలలోనూ వి ఆర్ వో ద్వారా ఈపాస్ నమోదు చేయించి కార్డు ఉన్నవారికి సరుకులు సరఫరా చేశారు .ఇప్పుడు  ఈపాస్ తప్పనిసరి   చేయడంతో వ్రృద్దులకు ఇబ్బందులు తప్పలేదు.ఈ పాస్ లో పేర్లు నమోదు చేసుకున్న వారే విడిపించు కోవడానికి రావాల్సి వస్తుంది.  పేర్లు నమోదు అయిన వయసు మళ్లిన వారు కార్డు పట్టుకొని వస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా  ఉండడం  వృద్ధులు ఎక్కువసేపు డిపోల వద్ద నిలబడలేక ఇబ్బంది పడుతున్నారు. కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ప్రమాదమని తెలియడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు విడతల్లో కార్డు పట్టుకొచ్చిన వారి కుటుంబ సభ్యులకి వి ఆర్ ఓ వారి పేర్లు నమోదు చేసుకుని సరఫరా చేసేవారు. తర్వాత ఈపాస్ నమోదు చేసే వారు. వాలంటీర్  తో పాటు ఇతర సిబ్బంది కూడా నిర్ధారించాక సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం పప్పు, బియ్యం  సరఫరా కావడంతో త్వరగా జరుగుతున్నప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. వృద్ధులకు చెయ్యి పట్టుకొని మరి నమోదు చేయాల్సి వస్తుందని ,దీనివల్ల తమకు ప్రమాదం పొంచి ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తమకు గ్లౌజులు గాని, మాస్క్ లు గాని ఇవ్వకపోవడంతో తామే స్వయంగా సమకూర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.తమ ప్రాణాలకు భద్రత అనేది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.