కరోనా కట్టడికి ఇంటింటి సర్వే


     ప్రస్తుతం ఎన్ని చర్యలు తీసుకున్నా.. లాక్డౌన్ ఎంతగా విధించినా కరోనా మహమ్మారి ప్రభావం మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఆ వైరస్ను కట్టడి చేసేందుకు ఉన్న మార్గాలను పరిశీలించింది. ఈ క్రమంలో అనారోగ్యం చెందిన ప్రతి ఒక్కరిని గుర్తించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటింటి సర్వే చేయాలని కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.




     కరోనా వైరస్ తాజా వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కరోనా వైరస్ కేసుల విషయంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడంలో జాప్యమవుతోందని గుర్తించారు. దీంతోనే తాజా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశమంతా ఒకేసారి పరీక్షలు చేస్తే కరోనా బాధితులు వెలుగులోకి వస్తారని.. వారందరినీ ఆస్పత్రికి తరలించి వైరస్ చైయిన్ను కట్ చేసే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంటింటి సర్వేకు మొగ్గు చూపింది.

     ప్రస్తుతం భారతదేశంలో కరోనా బాధితులు వేగంగా పెరుగుతున్నారు. ఆ వైరస్ బారిన పడిన వారు కూడా పెద్ద సంఖ్యలో కోలుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 27.4 శాతానికి పెరిగిందని కేంద్రం ప్రకటించింది. కేసుల సంఖ్య రెట్టింపయ్యే డబ్లింగ్ రేటు 12 రోజులుగా నమోదైంది. ఇక కేంద్ర బృందాలు ప్రతి జిల్లాలోనూ కోవిడ్-19 పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నాయి.