రైలు పట్టాలపై నిద్రించవద్దు - రైల్వే శాఖ

   


     రైలు పట్టాలమధ్యా లేదా రైల్వే ట్రాక్‌లకు పక్కనా నడవటం లేదా విశ్రమించటం చేయవద్దని ప్రజలకు ఈస్ట్ కోస్ట్ రైల్వే విజ్ఞప్తి చేసింది. ఇది ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారి తీయవచ్చని హెచ్చరించింది. రైల్వే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, జనం ఎవరూ ట్రాక్‌ల మీదికి రాకుండా చూడాలనీ ఆదేశించింది. ఆర్పిఎఫ్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ 182 కి పౌరులు ఫోన్ చేసి అనధికారిక వ్యక్తులెవరన్నా ట్రాక్‌లకు సమీపంలో ఉన్నట్లయితే సమాచారం అందించాలని ఉన్నతాధికారులు కోరారు. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక అత్యవసర ప్రకటన విడుదల చేసింది.



     “కోవిడ్19 కారణంగా ప్యాసింజర్ రైళ్లు నడవనప్పటికీ, దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువుల సరఫరా కోసం గూడ్సు రైళ్లు, పార్సెల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అన్ని రైల్వే ట్రాక్‌ల మీదా నిరంతరం నడుస్తున్నాయి. ఇటీవల శ్రామిక్ స్పెషల్ రైళ్లు కూడా ప్రారంభించారు. తూర్పుకోస్తా రైల్వే పరిధిలో కూడా ఇలాంటి అనేక రైళ్లు నడుస్తున్నాయి. కాబట్టి ట్రాక్‌లమీదా లేదా వాటి పక్కనా నడవడం చాలా ప్రమాదకరమైనది. ఇలా ట్రాక్ ల మీదికి రాకూడదని ఖచ్చితమైన నిషేధ ఉత్తర్వులు ఉన్నాయి. రైలు పట్టాల మీద నడవవద్దని, నిర్లక్ష్యంగా దాటవద్దని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారం చేస్తున్నాం. పరిమిత ఎత్తు సబ్వేలు, మాన్డ్ రైల్వే క్రాసింగులను మాత్రమే ఉపయోగించాలి.


     ట్రాక్‌మెన్, వంతెన మరమ్మతు సిబ్బంది, స్టేషన్ మాస్టర్స్, ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ మరమ్మతు సిబ్బంది, ఆర్‌పిఎఫ్ సిబ్బంది, ఇతర రైల్వేమెన్‌లను అప్రమత్తం చేశాము. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు ఎవరన్నా జరుపుతుంటే వారిని నిరోధించి, మాకు నివేదించాలని హెచ్చరించాము. ప్రమాదమని తెలిసినా చాలా సార్లు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి గీత దాటినట్లు కనిపిస్తోంది. ఈ తరహా ప్రయాణమ నిషేధిం, రైల్వే చట్టంలోని సెక్షన్ 147 ప్రకారం శిక్షార్హమైనది కూడా. కనుక ఎవరూ అనధికారికంగా ట్రాక్ దాటకూడదు లేదా నడవకూడదు. అతిక్రమించిన వారిపై చట్టప్రకారం విచారణ జరుగుతుంది. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలపై ఇలాటి కేసులు నడపటం రైల్వేలకు మనస్కరించని అంశమే. కనుక ప్రజలు వారి వ్యక్తిగత భద్రత దృష్ట్యా రైలు పట్టాల దగ్గర వెళ్ళకుండా ఉండాలని సలహా ఇస్తున్నాము — అని తూర్పు కోస్తా రైల్వే తెలిపింది.